Sunday, August 19, 2012

సనాతన వైదిక ధర్మం - 5

ధర్మం అంటే ?


'వేదోఖిలో ధర్మ మూలం' వేదం అనేది మన ఆచరించాల్సిన సాధనాలను తెలిపేవి. వేదాలు తెలిపిన నియమాలని, ఆచరణని పాటించడమే ధర్మం అంటే. 'ధ్రియతే ధారయతే ఇతి ధర్మః'. 'ధారయతే' - మనం చేయాల్సిన సాధన. ముందు మనం ఆచరిస్తాం, 'ధ్రియతే' ఆపై ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఉదాహరణగా ముందు మనం సైకిల్ నడపడం నేర్చుకుంటాం, ఆతరువాత అదే మనల్ని నడిపిస్తుంది. అట్లా ధర్మాన్ని మనం మొదట ఆచరిస్తే, అది మనల్ని కాపాడుతూ సులువుగా మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. మరొక ఉదాహరణగా ఒక గింజను మనం నేలలో నాటి నప్పుడు, అది వృదా అయినట్లు అని పిస్తుంది, కానీ కొంతకాలానికి తనలోంచి అనేక గింజలను పుట్టిస్తుంది. అట్లా మనం చేసే సాధన కొంత కష్టంగా అనిపించినా అది మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ధర్మాన్ని మన పూర్వులైన ఋషులు ఆచరించి ఫలితం పొందారు. వారు దాన్ని వారి శిష్యులకు అందించారు. విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఉత్తర పీఠికలో 'ఆచార ప్రభవో ధర్మః' అని చెబుతుంది. ఆచరించిన చూపిన వారి ఆచరణలే ధర్మాలు అయ్యాయి. మనం చేయాల్సినదేమి, చేయకూడనిది ఏమి అని విధి నిషేదాలను వేదాలు తెలుపుతాయి. అందుకే మనిషి ఈ ప్రకృతిలో ఎట్లా బ్రతకాలి అనే విషయాలని తెలుపుతాయి వేదాలు.

వేద శాఖలు


ఋషులు మొదట దర్శించిన వేద శబ్దాలను అట్లే వారు తమ శిష్యులకు అందించారు. వేద మంత్రాలలోని ఆయా లక్షణాలను బట్టి ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదం మరియూ ఆదర్వణ వేదం అని నాలుగు భాగాల క్రింద విడదీసి చెబుతారు. అయితే వీటన్నింటినీ ఒకే రాశి క్రింద ఒక్కరే నేర్వగల సామర్థ్యం ఉండేది. అవి కేవలం నోటిద్వారా నేరవాల్సిందే కానీ పుస్తక రూపంలో కాదు. అందుకే వాటిని నిలుపుకునే సామర్థ్యం రానున్న తరాలకు ఉండదని తెలిసి వాటిని వేదవ్యాసుడు కొందరు శిష్యులకు కొంత కొంత విభజించి ఇచ్చాడు. వారు తమ శిష్యులకు మరిన్ని ఉపశాఖలుగా విభజించి ఇచ్చారు. శ్రీమన్నారాయణుడు కూడా వేదాన్ని తయారు చేయలేదు, ఆయన మొదట దర్శించి చతుర్ముఖ బ్రహ్మకు అందించాడు. ఆయన తన పుత్రులకు అందించాడు. ఇలా మన ఋషుల వరకు అందాయి. ఒకప్పుడు మన వద్ద ఉన్న వేద రాశి ఎంతో తెలుసుకుందాం.
వేద వ్యాసుడు మొత్తం వేదాన్ని 1131 శాఖలుగా విభజించాడు. అందులో ఋగ్వేదం 21 శాఖలుగా, యజుర్వేదం 101 శాఖలుగా, సామ వేదం 1000 శాఖలుగా మరియూ ఆదర్వణ వేదం 9 శాఖలుగా ఉండేది.

ఒక్కో వేదం మూడు విభాగాల క్రింద ఉంటాయి అవి.
 1. సంహితలు, 2. ఆరణ్యకములు మరియూ 3. బ్రాహ్మణములు

ఋగ్వేదం

ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.
ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః |
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||






ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట.
సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు (మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి.
ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.
ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది.
బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి.
ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి.

యజుర్వేదం

యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.

అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ |
వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||






మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు.
యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియూ కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం  కాన్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది.
కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది.
బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది.
శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి.
కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.

సామ వేదం


సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు.

నీలోత్పలధలశ్యామోః సామవేదో హయాననః |
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః ||






కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు.
సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ, కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు.
సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది.
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది.
ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది.

ఆదర్వణ వేదం

ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.


 ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః |
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||




తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు.
ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి.
శిల్పవేదం ఉపవేదంగా ఉంది.
బ్రాహ్మణాలలో గోపత బ్రాహ్మణం ఉంటుంది.
ఆరణ్యకాలు ఏవీ లభించడం లేదు, మొత్తం 31 ఉపనిషత్తులలో ప్రస్న, ముండక, మాండుక్య అనేవి లభిస్తున్నాయి. 

వేదాంగాలు- వివరణ గ్రంథాలు


మనం ఈనాడు పాశ్చాత్యులు చూపిస్తున్న విజ్ఞానామే గొప్ప అని భావిస్తున్నాం, కానీ మన వేదాలలో ఎంతో విజ్ఞానం ఉందని మరచి ప్రవర్తిస్తున్నాం. వేదాలు ఏమిటో తెలుసుకోవాలని ఈ నాడు పాశ్చాత్యులు ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ దురదృష్టకరం మనం వాటిని ఆదరించడం లేదు. దాన్ని కొంతనైన అర్థచేసుకొనే ప్రయత్నం చేద్దాం.
వేదాలు ముఖ్యంగా ఋగ్,యజుస్,సామ మరియూ ఆదర్వణ విభాగాలుగా ఉంది. ఇంత వేదరాశి సహజమైన శబ్దాలు. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం ?  వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేద రాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి ఆరు.

1. శిక్షా

వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల  ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది.

2. వ్యాకరణం

కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది, అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మానవ అనే పదం. మను అనే మహర్షి యొక్క సంతతి కనక మానవ అయ్యింది.

3. కల్పకం

వేద యజ్ఞంకోసం చేయాల్సిన యాగ శాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పకం.

4. నిరుక్తం

పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 'మత్వా కర్మాణి సీవ్యతి'. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసే వాడు కనక మనిషి అని పేరు.

5. ఛందస్సు

ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణుసహస్రనామాలు ఉండేవి అనిష్టుప్ ఛందస్సు, అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు, కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్నూ ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు, అట్లానే గాయత్రి ఛందస్సు కూడా.

6. జ్యోతిషం

మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.
పై ఆరిటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.

(ఇంకా వుంది...)

1 comment:

  1. Thank u for enlightening us.
    People like us living in far off countries like USA, are unfortunately ignorant of these details to be passed on to our next generations. These details are not available in Google.com.
    I look forward to see your next and subsequent series of these details.
    May The Almighty shower HIS choicest blessings on you for doing this noble work. To me, you are no less than one of our reverend Rishies.

    ReplyDelete